ఏకోపాధ్యాయ విద్య

education-systemకోవెలకుంట్ల: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు ధీటుగా విద్యనందిస్తామని చెబుతున్న సర్కారు మాటలకు.. చేతలకు పొంతన కుదరని పరిస్థితి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాల్సి ఉండగా.. పోస్టులను కుదించి ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చేయడం విమర్శలకు తావిస్తోంది. ఫలితంగా గ్రామీణ విద్యార్థులకు విద్య క్రమంగా దూరమవుతోంది. వేలాది రూపాయల డొనేషన్లతో పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించలేక తల్లిదండ్రులు ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం అప్పటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా జారీ చేసిన జీవో 55 నిరుపేద విద్యార్థులకు శాపంగా మారింది.

జిల్లాలో 1,835 ప్రాథమిక.. 447 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా, జీవో ప్రకారం 394 ప్రాథమిక, 13 ప్రాథమికోన్నత పాఠశాలలకు ఏకోపాధ్యాయులే దిక్కయ్యారు.

ఇక ఉదయం ప్రార్థన మొదలు.. సాయంత్రం బడి ముగిసే వరకు ఒక్క ఉపాధ్యాయుడు అన్నీ తానై చూసుకోవాల్సి వస్తోంది. మధ్యాహ్న భోజన పథకం.. స్కూల్ కాంప్లెక్స్ రికార్డులు.. విద్యా బోధన.. విరామ సమయంలో ఆటలపోటీలు.. సాంస్కృతిక కార్యక్రమాల్లో తర్ఫీదునివ్వడం వారికి తలకు మించిన భారమవుతోంది. అనివార్య కారణాలతో ఉన్న ఒక్క ఉపాధ్యాయుడు సెలవు పెడితే ఆయా పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారుతోంది. చాలా వరకు పాఠశాలలు మూతపడుతున్నాయి. ఏకోపాధ్యాయులు మండల విద్యాధికారి అనుమతితో సెలవు తీసుకోవాల్సి ఉండగా.. ఆ అధికారి తన ఆధీనంలోని క్లస్టర్ రిసోర్స్ పర్సన్, సమీప పాఠశాలలోని మరో ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై పంపాల్సి ఉంటోంది. అనారోగ్యంతో వారం రోజులకు పైబడి సెలవు పెడితే డిప్యూటేషన్‌పై వచ్చిన ఉపాధ్యాయులు మొక్కుబడిగా విధులు పూర్తి చేసుకుని వెళ్లాల్సి వస్తోంది.  ఇప్పటికైనా ప్రభుత్వం ఏకోపాధ్యాయ పాఠశాలలపై దృష్టి సారించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *